చెన్నైలోని అన్నాల్ వయోలెట్ మెట్రిక్యులేషన్ స్కూల్ ఒక వినూత్న విధానానికి నాంది పలికింది. పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేటప్పుడు.. పిల్లల తల్లిదండ్రులకు వారి బాధ్యతలను తెలియజేయడానికి ఒక నవీన పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆ కొత్త పద్ధతిలో భాగంగా సెలవుల్లో పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ఇచ్చిన ప్రాజెక్టు వర్కు  పూర్తి చేయాలని తెలిపింది. "హాలీడే అసైన్‌మెంట్‌" పేరుతో ఆ ప్రాజెక్టు వర్కును తల్లిదండ్రులు తప్పనిసరిగా చేసి.. సెలవులయ్యాక స్కూలుకి తీసుకొచ్చి ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఆ ప్రాజెక్టు వర్కులో ఒక జాబితాని విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న పనుల్లో కనీసం సగమైనా తల్లిదండ్రులు పూర్తిచేస్తే సంతోషిస్తామని.. ఆ పనులు కచ్చితంగా చేశామని చెప్పడానికి ఆధారాలుగా ఫోటోలను తీసి పంపిస్తే సరిపోతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంతవరకు అక్కర ఉందో తెలుసుకోవడానికే ఈ ప్రాజెక్టు అని.. తల్లిదండ్రులకు వారి బాధ్యతను గుర్తుచేసి.. వారి బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది


ఈ ప్రాజెక్టు వర్కులో భాగంగా ఈ క్రింది పేర్కొన్న జాబితాలోని పనుల్లో కనీసం సగమైనా తల్లిదండ్రులు కచ్చితంగా సెలవుల్లో చేయాల్సి ఉంటుంది 


* తల్లిదండ్రులు ప్రతీ రోజు పిల్లలతో కలిసి కనీసం రెండు పూటలైనా భోజనం చేయాలి. అలా భోజనం చేసేటప్పుడు పిల్లలకు ఆహారానికి సంబంధించిన ప్రాధాన్యాన్ని తెలపాలి. రైతన్నలు పంట పండించడం కోసం ఎంత కష్టపడుతున్నారో పిల్లలకు వివరించాలి. 
*తల్లిదండ్రులు పిల్లలకు తమ ప్లేట్లను తామే కడుక్కొనేలా అలవాటు చేయాలి. అలా అలవాటు చేసేటప్పుడు తమ పనులు తాము చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాలి
*తల్లిదండ్రులు వీలైతే పిల్లలకు ఏదో ఒక వంటకం స్వయంగా తయారుచేయడం నేర్పించాలి. కనీసం వారికి వారు ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినేలాగైనా శిక్షణ ఇవ్వాలి.
*తల్లిదండ్రులు కనీసం రోజుకి 5 కొత్త ఆంగ్ల పదాలు నేర్చుకొని వాటిని ఒక నోటు పుస్తకంలో రాయాలి. వాటిని పిల్లలకు చెప్పాలి
*తల్లిదండ్రులు తమ పొరుగింటివారితో కలిసి మాట్లాడాలి. వారిని నవ్వుతూ పలకరించాలి. వారికి పిల్లలు ఉంటే వారితో కూడా స్నేహపూర్వకంగా మెలగమని తమ పిల్లలకు తెలపాలి.
*తల్లిదండ్రులు తమ పిల్లలను వారి తాతయ్య, అమ్మమ్మలకు చేరువ చేయాలి. వారి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు పిల్లలకు చెప్పాలి
*తల్లిదండ్రులు ఉద్యోస్తులైతే వారికి ఈ ప్రాజెక్టు గురించి తమ కంపెనీ వారికి చెప్పి.. పిల్లలతో కలిసి ఓ రోజు ఆఫీసు చూసేందుకు పర్మిషన్ తీసుకోవాలి. పరిష్మన్ వచ్చినట్లయితే పిల్లలను తమ పనిప్రదేశానికి తీసుకెళ్లి.. తాము ఎలాంటి పని చేస్తున్నారో వారికి విశదీకరించి చెప్పాలి
*తల్లిదండ్రులు పిల్లలను మార్కెట్‌కు తీసుకెళ్లాలి.. వారికి కూరగాయల పట్టిక, ధరల గురించి తెలియజేయాలి
*తల్లిదండ్రులు పిల్లలకు ఏవైనా తిరునాళ్లకు, జాతరలకు తీసుకెళ్లాలి. వాటి ప్రాధాన్యాన్ని వివరించాలి
*తల్లిదండ్రులు పిల్లలకు పూలమొక్కలు పెంచేలా శిక్షణ ఇవ్వాలి. 
*తల్లిదండ్రులు పిల్లలకు తమ చిన్నతనంలో జరిగిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయాలి
*తల్లిదండ్రులు పిల్లలకు మూగజీవాల పట్ల ప్రేమతో ఉండాలని తెలిపాలి. వారికి ఇష్టమైన పెంపుడు జంతువు గురించి తెలుసుకొని.. దాని బాధ్యతను అప్పగించాలి. 
*తల్లిదండ్రులు పిల్లలకు జానపద గీతాలను పాడడం నేర్పించాలి
*తల్లిదండ్రులు పిల్లలకు కథల పుస్తకాలను కానుకగా ఇవ్వాలి. 


తల్లిదండ్రులు ఈ పనుల్లో కనీసం సగం వాటినైనా పూర్తి చేసి.. ఈ పనులు చేసినట్లు ఫోటోలను ఆధారాలుగా చూపిస్తూ ప్రాజెక్టు స్కూలుకి అందివ్వాలి. ఉత్తమమైన ప్రాజెక్టు చేసిన తల్లిదండ్రులకు స్కూలు ప్రోత్సాహక బహుమతి కూడా ఇస్తుందట.