నటుడు కార్తీ తమిళంలో నటించిన "కడైకుట్టి సింగం" సినిమా తెలుగులో "చినబాబు" పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారత ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు. "ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా “చినబాబు”. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాద భరితంగా రూపొందిన “చినబాబు” సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం" అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో “చినబాబు” చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు" అని ఉప రాష్ట్రపతి తెలియజేశారు. 


ఉపరాష్ట్రపతి చేసిన ట్వీట్ పై నిర్మాత సూర్య స్పందించారు. "'సార్.. మీరు మా చిత్రాన్ని పొగడడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మీవంటి నాయకులు సమయం తీసుకొని మేం చేసిన చిన్న ప్రయత్నాన్ని చూసి మెచ్చుకోవడం అంటే మాకు అది అరుదైన గౌరవం. మీ ట్వీట్ చూసి మా టీమ్ ఎంతో ఆనందాన్ని పొందింది. సినిమాను వినోదంతో పాటు విలువలతో కూడిన గొప్ప మాధ్యమంగా తీర్చిదిద్దాలని మేం నేర్చుకొనేలా చేసింది" అని ఈ చిత్ర నిర్మాత సూర్య ట్వీట్ చేశారు.