హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, టాలీవుడ్ తొలి తరం సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 73 ఏళ్లు. ప్రముఖ సీనియర్ హీరో నరేష్ ఆమె తనయుడే. ప్రముఖ సినీ నటి జయసుధకు విజయ నిర్మల పిన్ని అవుతారు. తమిళనాడులో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో 1946లో ఫిబ్రవరి 20న జన్మించిన ఆమె అసలు పేరు నిర్మల. అయితే, తనకు ఏడవ ఏట ఉండగానే తొలిసారిగా బాలనటిగా సినిమా అవకాశాన్ని అందించిన విజయ స్టూడియోస్‌కి కృతజ్ఞతగా విజయ నిర్మల అని పేరు మార్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1950లో మత్స్యరేఖ అనే తమిళ చిత్రం ద్వారా తన ఏడవ ఏటనే తమిళంలోకి, పాండురంగ మహత్యం అనే తెలుగు చిత్రం ద్వారా 11వ ఏటనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె రంగుల రాట్నం అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అది మొదలు ఆమె ఇక వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 200కి పైగా సినిమాల్లో మెప్పించడమే కాకుండా ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూనే దర్శకురాలిగానూ రాణించారు.


గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్‌లో:
నటిగా బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు(44) దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.