వాట్సాప్‌లో మీ సమాచారం భద్రమేనా? మన రహస్యాలను నమ్మకంగా వాట్సాప్‌లో పంచుకోవచ్చా? అనే సందేశాలు ఇప్పుడు యూజర్లను భయపెడుతున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్ డేటా లీక్‌తో ఆందోళన చెందుతున్న యూజర్లకు ఇది నిజంగా చేదువార్తే.. వాట్సాప్, ఫేస్‌బుక్ మన జీవితాల్లో ఎంతలా భాగమైపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మనం పంచుకునే విషయాలన్నీ నిజంగా మనకు మాత్రమే పరిమితమా..? మన రహస్యాలను నమ్మకంగా వాట్సాప్‌లో పంచుకోవచ్చా అంటే మాత్రం కాస్త ఆలోచించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోటోలు, వీడియోల రూపంలో వాట్సాప్‌లో మనం షేర్ చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చేసుకొనే వీలుంటుందని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను షేర్ చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


ఎండ్- టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో చాటింగ్ వివరాలు ఎవరూ చూడలేరనే వాట్సాప్‌.. పేమెంట్స్ వివరాలను మాత్రం ఫేస్‌బుక్‌కి పంపిస్తోంది. యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన పేమెంట్ సౌకర్యంతో ఎవరైనా చెల్లింపు చేస్తే సదరు ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్, యూపిఐ, పంపిన నగదు వివరాలు ఫేస్‌బుక్‌కి  వెళ్తాయట. 'చెల్లింపుల సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు థర్డ్ పార్టీకి వివరాలు అందిస్తాం' అని ప్రైవసీ పాలసీలో వాట్సాప్‌ స్పష్టంగా పేర్కొంది.


మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం ఎలా?
 
* హ్యాకర్ల బారి నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి. గుర్తుతెలియని నంబర్లను బ్లాక్ చేయండి.
 
* మీ స్మార్ట్‌ఫోన్‌‍లోని వాట్సాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్సాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.
 
* మీ వాట్సాప్ అకౌంట్‌లో ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు సంబంధించి ప్రివ్యూలు పుష్ నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని వేరొకరు చూసే అవకాశముంది కాబట్టి ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవటం మంచిది. సెట్టింగ్స్‌లోని నోటిఫికేన్స్‌లోకి వెళ్లి ‘షో ప్రివ్యూ’ ఆఫ్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరి.
 
* ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి. ఈవిషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాల్సిన పని ఇది.
 
* మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయవద్దు. వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు.  
 
వీటితో పాటు మన జాగ్రత్తలో మనం ఉండి.. కాస్త జాగ్రత్తగా వాట్సాప్ వాడుకుంటే మంచిది.