వాట్సాప్‌లో లైవ్‌లోకి గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయం
కస్టమర్ల కోసం ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
కస్టమర్ల కోసం ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది. 2016 నుండి వీడియో కాలింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. నేటికి గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. దీంతో గ్రూప్ కాలింగ్‌లో ఆడియో, వీడియోకి సంబంధించిన ఫీచర్లు కూడా వచ్చి చేరాయి.
వాట్సాప్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయం కోసం కస్టమర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో లేదా యాపిల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి కాల్స్ అనే విభాగంలోకి వెళ్లి ఎవరికైనా వీడియో కాల్ చేయవచ్చు. ఆ తర్వాత అదనంగా వీడియో కాల్‌లో మరో కాంటాక్ట్ జత చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది.
ఈ కొత్త పద్ధతిలో తొలుత ఇద్దరు వీడియో కాల్ చేయాలి. తర్వాత మరో ఇద్దరు ఇందులో చేరవచ్చు. ఇలా ఒకేసారి నలుగురు వీడియో కాలింగ్‌లో సంభాషించుకోవచ్చు. కాల్ చేసిన వ్యక్తి వీడియోతోపాటు అవతల వ్యక్తుల వీడియో కాల్ స్ర్కీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఇప్పటివరకు వాట్సాప్ వీడియోకాల్ ద్వారా కేవలం ఒక్కరికే వీడియోకాల్ చేసే అవకాశం ఉండేది. అయితే తాజా అప్‌డేటెడ్ ఫీచర్ ద్వారా ఒకేసారి నలుగురికి వీడియో కాల్ చేయవచ్చు. మేలో జరిగిన 'ఫేస్‌బుక్ డెవలపర్ల సదస్సు ఎఫ్8-2018' గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని ప్రవేశపడుతున్నట్లు ప్రకటించి.. బీటా వెర్షన్‌లో మాత్రమే అవకాశం కల్పించారు.
అటు.. ఫేస్‌బుక్ మెసెంజర్ గ్రూప్ వీడియో కాలింగ్ 50 మంది వరకు సపోర్టు చేస్తుంది. స్కైప్ 25 మందిని, స్నాప్‌చాట్ 16 మందిని, యాపిల్ ఫేస్‌టైం 32 మంది వరకు సపోర్టు చేస్తుంది.