తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలిప్పిస్తానని నమ్మబలికి మోసం చేస్తున్న ఓ జూనియర్ ఆర్టిస్టుపై పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు దాడికి పాల్పడ్డారు. గత కొద్ది సంవత్సరాలుగా తన వద్దకు వేషాల కోసం వచ్చే యువతులను మోసం చేస్తున్న శ్రీశాంత్‌రెడ్డి అనే జూనియర్ ఆర్టిస్టు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను స్టేషనుకి పిలిపించి పోలీసులు మాట్లాడుతున్న సమయంలో మహిళలు అతనిపై చెప్పులతో దాడి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే పరుషపదజాలంతో దూషించారు. ఇదే క్రమంలో పోలీసులు ఆపడానికి ప్రయత్నించినా వారు వినలేదు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దాంతో ఆ మహిళలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు.శ్రీశాంత్‌రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని.. కోర్టుకి అప్పగించి తగిన శిక్ష విధించేలా చేయాలని పలు మహిళా సంఘాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి.


గతకొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ వివాదంతో అట్టుడికిన ఫిల్మ్ నగర్ ప్రాంతం తాజా ఉదంతంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జూనియర్ ఆర్టిస్టు సప్లయిర్స్, కో ఆర్డినేటర్లు, మేనేజర్లు.. ఇలా రకరకాల పేర్లతో సినీ పరిశ్రమతో సంబంధం లేనివారు కూడా కొత్తగా పరిశ్రమలోకి వచ్చేవారిని మోసం చేస్తున్నారని.. వారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు తెలిపారు.


ఒకవేళ సదరు వ్యక్తులు లేదా సంస్థలపై అనుమానం వస్తే.. పోలీస్ స్టేషనుకి వచ్చి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. గత కొద్ది నెలలుగా శ్రీరెడ్డి ఉదంతంతో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి తెలుగు సినీ పరిశ్రమలో భారీగానే చర్చ జరిగింది.