సోషల్ మీడియా మాధ్యమంలో ట్విట్టర్‌ను వాడుతున్న యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్విట్టర్ ఐఎన్సీ హెచ్చరించింది. తమ అంతర్గత కంప్యూటర్ సిస్టమ్స్‌లో నిక్షిప్తమైన అయిన టెక్ట్స్ మెసేజ్‌లలో ఓ బగ్‌ను గుర్తించామని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని తొలగించామని, ఈ బగ్ వల్ల ఎవరి పాస్‌వర్డ్‌లు హ్యాక్ కాలేదని, అయితే ముందు జాగ్రత్త చర్యగానే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచిస్తున్నామని అఫీషియల్ బ్లాగ్‌లో ట్విట్టర్ పేర్కొంది.


ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి స్టోర్‌ చేసిన పాస్‌వర్డ్‌లన్నింటిన్నీ తొలగించామని, ఎవరికీ పాస్‌వర్డ్‌లు ఇక కనిపించవని ట్విటర్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ కూడా తాజా బగ్‌పై ట్వీట్ చేశారు. అయితే ఎంతమంది పాస్‌వర్డ్‌లపై ఈ ప్రభావం ఉంటుంది? ఏఏ దేశాల వారు మార్చుకోవాలన్న విషయమై స్పష్టత ఇవ్వని ట్విట్టర్, ఎన్నో నెలల పరిశోధన తరువాత బగ్ బయటకు వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ చెప్పింది. అకౌంట్లను సురక్షితంగా ఉంచుకునేందుకు  యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విటర్‌ సూచించింది.