ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్సీపీ పోరాటం !
స్పెషల్ స్టేటస్ కోసం పోరుబాట పట్టిన ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నేడు ఢిల్లీలో మహాధర్నా చేపట్టింది.
స్పెషల్ స్టేటస్ కోసం పోరుబాట పట్టిన ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నేడు ఢిల్లీలో మహాధర్నా చేపట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనట్టయితే, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికైనా సిద్ధమేనని ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. హోదా కోసం పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా పోరాడుతారని, అందులో భాగంగానే ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఉమ్మారెడ్డి ప్రకటించారు. ఒకవేళ అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించనట్టయితే, ఏప్రిల్ 6న వైఎస్సార్సీపీ ఎంపీలతా తమ పదవులకు రాజీనామా చేస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగబోదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా వైఎస్‌ఆర్‌సీపీతో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
'ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు' అనే నినాదంతో చేపట్టిన ఈ మహాధర్నాలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతోపాటు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని ఉమ్మారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఉమ్మారెడ్డి ఆరోపించారు.