తగినంత నిద్రపోవటం లేదా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు వైద్యులు. టీవీ, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు టైంకు నిద్రపోవడం లేదని వారి వాదన. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలకు నిద్రలేకపోతే పెద్దయ్యాక అనేక రుగ్మతలకు గురవుతారని అంటున్నారు. ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం, ఒత్తిడికి లోనవడం వంటివి అందులో ప్రధానమైనవి.
పిల్లల ఎదుగుదలలో నిద్ర చాలా కీలకం. రోజుకు 6-10 గంటల నిద్ర అవసరమని.. 3-5 సంవత్సరాల పిల్లలు రోజుకు 11 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. వయసుకు తగినంత నిద్ర లేకపోవడం వల్ల పరిసరాలు, అవసరాలకు తగ్గట్టు మెదడు స్పందించే సామర్థ్యం తగ్గుతూ వస్తుందని చిన్నపిల్లల మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా ఇంటా, బయటా వారు నైపుణ్యాన్ని, చురుకుదనాన్ని ప్రదర్శించలేకపోతున్నారని వారి భావన. కాబట్టి రాత్రుళ్లు పిల్లలకు త్వరగా జో.. కొట్టి నిద్రపుచ్చాలని కోరారు.