ఒళ్లు జలదరించే సౌందర్య చిట్కాలు
పూర్వం అందంగా కనిపించాలంటే ఒంటికి సగ్గుపిండి, పసుపు .. వంటివి పూసుకొనేవారు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. బ్యాటిపార్లర్లు, స్పాలకు వెళ్తున్నారు. అక్కడ రకరకాల సౌదర్యం చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఈ సౌందర్య చికిత్సలు వింతగా తయారయ్యాయి. ఎంతలా అంటే .. మన ఊహకు అందనంత.
* జపాన్ లో నైటింగేల్ పక్షి వేసే రెట్టలు ఎండాక, ఆ పొడిని బియ్యం నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటారు. చర్మ సమస్యలని దూరం చేసుకొనేందుకు ఈ రకం ఫేషియల్ వేసుకుంటారట.
* క్రయోథెరపీ చికిత్సలో భాగంగా మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద అతిథుల్ని మూడు నిమిషాలు ఉంచుతారు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు సుమీ! అంత కష్టపడి గడ్డకట్టే అంత చలిలో ఎందుకు ఉంటారనేగా మీ డౌట్? ఆ గడ్డ కట్టే చలి వల్ల శరీరం ఆనందాన్ని కలిగించే సెరోటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుందట. ముఖంపై చిరునవ్వు లేని ఎంతటివారినైనా ఈ థెరపీ ద్వారా నవ్వించవచ్చట.
* పైన కూరగాయ పాత్ర పెట్టి కింద మంట పెట్టినట్టు.. ఫిలిప్పీన్స్ లో మనుషుల్ని నీటిలో నింపిన పెద్ద పాత్రల్లో పడుకోబెట్టి కింద మంట పెడుతారు. ఔషధ మూలికలు వేసిన ఆ నీరు వేడెక్కుతుంటే హాయైన అనుభూతి కలగడంతో పాటు మృతకణాలు (dead cells) తొలగుతాయట. చైనాలో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఒకటుంది. ఆ చికిత్సతో ముడుతలు పోయి యవ్వనం వస్తుందట.
* జపాన్ తో పాటు మరికొన్ని దేశాల్లో స్నెయిల్ ఫేషియల్స్ అనే కొత్త రకం ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే నత్తను ముఖంపై పాకించుకోవడం. నత్త పాకేటప్పుడు జిగట పదార్థాన్ని విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ద్రవంలో చర్మంపై ముడుతలు పడకుండా చెయ్యగల ఔషధ గుణాలు ఉన్నాయట.
* ఫిలిప్పీన్స్, ఇతర దేశాల్లో కోరలు పీకిన పాములు, కొండా చిలువల్ని శరీరంపై పాకించి మసాజ్ చేస్తున్నాయి కొన్ని స్పాలు. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. శరీరానికి విశ్రాంతి కూడా అందుతుందట.
* జలగలు రక్తాన్ని పీల్చుతాయని తెలుసు. అలాంటిది శరీరంపై పాకించుకుంటే.. ! వామ్మో అనమూ. కానీ వివిధ దేశాల్లో కొన్ని బ్యూటీ స్పాలలో ఈ తరహా థెరపీ ఉంది. దీనిని లీచ్ థెరపీ అంటారట. ఈ చికిత్సలో పదుల సంఖ్యలో ముఖంపై జలగల్ని వదులుతారట. జలగలు చర్మం పై పొరల్లో ఉండే చెడు రక్తాన్ని పీల్చేస్తాయిట.
* ఇవి కొన్ని మాత్రమే.. తేనెటీగలతో కుట్టించుకోవడం, మనిషి రక్తాన్ని ముఖానికి రాసుకోవడం, పాములు, తేళ్ల నుంచి తీసే విషంతో ఫేషియల్స్, బీరు, వైనూ, కాఫీ, టీ .. స్నానాలు ఇలా ఎన్నో రకాల సౌందర్య చికిత్సలు పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.