దోల్పూర్: రాజస్తాన్‌లోని దోల్పూర్‌ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాల అనంతరం మంగళవారం రాత్రి చేపట్టిన దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో పదిమంది పర్బతి నదిలో మునిగి చనిపోయారు. మొదట ఒకరు నీటిలో దునికి మునిగిపోతుండగా అతడిని రక్షించేందుకని ఒకరి వెనుక మరొకరిగా మిగతా వారంతా దూకి నీటిలోనే మునిగిపోయారని తెలిసిందని పోలీసులు తెలిపారు. 


దోల్పూరు జిల్లా కలెక్టర్ రాకేష్ జైశ్వాల్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో ఏడుగురి మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. నీటిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీసేందుకు గజ ఈతగాళ్లతోపాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి లక్ష రూపాయలను తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేశామని కలెక్టర్ రాకేష్ జైశ్వాల్ చెప్పారు.