ఒక్క బైక్‌పై 189 ట్రాఫిక్ చలానాలు
ఒక్క బైక్‌పై 189 ట్రాఫిక్ చలానాలు
చండీగఢ్: ఒక వాహనంపై ఒకట్రెండు, లేదా ఐదారు చలానాలు ఉండటం ఇటీవల కాలంలో సర్వ సాధారణమైపోయింది కానీ తాజాగా చండీఘడ్‌లో వెలుగుచూసిన ఓ ఘటనలో మాత్రం ఒక బైక్‌పై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 189 చలానాలు ఉండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాకుండా సదరు ద్విచక్ర వాహనదారుడికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం షరా మామూలేననే సంగతిని ఈ ఘటన బయటపెట్టింది. అయితే, అంతకుమించిన ఆశ్చర్యం ఏంటంటే.. తన ద్విచక్రవాహనంపై 189 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయనే సంగతి ట్రాఫిక్ పోలీసులు పట్టుకునే వరకు అతడికే తెలియకపోవడం. అవును, చండీఘడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కొత్త మోటారు వాహన చట్టం 2019 అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సెక్టార్ 33 ప్రాంతంలో సంజీవ్ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ రాంగ్ రూట్‌లో యూ టర్న్ తీసుకుంటూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికి రూ.300 చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు.. జిల్లా కోర్టుకు పంపించారు. అక్కడే సంజీవ్‌కు దిమ్మతిరిగిపోయే అసలు విషయం తెలిసింది. అదేమంటే.. 2017-19 మధ్య కాలంలో తాను నడుపుతున్న ద్విచక్ర వాహనంపై 189 ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలుసుకుని షాకవడం సంజీవ్ వంతయ్యింది.
ఇదే విషయమై సంజీవ్ మాట్లాడుతూ.. ''పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు తాను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే కానీ.. మరి ఇంత భారీ సంఖ్యలో తన వాహనంపై చలానాలు నమోదయ్యాయనే సంగతి మాత్రం నిజంగానే తనకు తెలీదని వాపోయాడు. తాను అన్నిసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా ట్రాఫిక్ సిబ్బంది సైతం హెచ్చరించలేదంటున్న సంజీవ్.. ''కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగానే ఉంటున్నాను'' అని వివరించాడు. 189 చలానాలను చెల్లించడం కంటే... తన బైక్‌ను ఇక్కడే వదిలేసిపోవడం ఉత్తమేమోనని అనిపిస్తోందని సంజీవ్ కోర్టు ఎదుట వాపోయాడు.