మొదలైన క్యాంప్ రాజకీయాలు: రిసార్టు నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు `మిస్సింగ్`
కర్ణాటక గవర్నర్ వైఖరిపై ఓ వైపు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు విధానసౌధ వద్ద ఆందోళనలో ఉండగా... కాంగ్రెస్ వర్గాల్లో కలవరం మొదలైంది.
కర్ణాటక గవర్నర్ వైఖరిపై ఓ వైపు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు విధానసౌధ వద్ద ఆందోళనలో ఉండగా... కాంగ్రెస్ వర్గాల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈగిల్టన్ గోల్ఫ్ రిసార్ట్ నుంచి మిస్సయ్యారు. సంఖ్యాబలం పెంచుకొని గవర్నర్ ముందు బలనిరూపణ నిరూపించుకోవాలని బీజేపీ యోచిస్తున్న తరుణంలో..ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం పలు సందేహాలకు తెరలేపింది. కాంగ్రెస్ శిబిరం అదృశ్యమైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు స్థానిక ఛానళ్లు కన్తనలను ప్రసారం చేస్తున్నాయి.
అయితే దీనిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందిస్తూ.. నిజమే.. ఇద్దరు ఎమ్మెల్యేలు రిసార్టులో లేరని, అయితే వాళ్లు కనిపించకుండా పోయారనడం వాస్తవం కాదని, వారు రిసార్టుకు వచ్చే దారిలో ఉన్నారని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లోగా బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉండటంతో.. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు జాగ్రత్త పడుతున్నాయి. ఎమ్మెల్యేలు బీజేపీకి దొరక్కుండా రిసార్టులకు తరలించి రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.