మహారాష్ట్రలో రైతు రుణాల మాఫీ కోరుతూ.. అలాగే కరవు భూములకు నష్టపరిహారం కోరుతూ.. ఈ డిమాండ్లను వెంటనే తీర్చాలని దాదాపు 20,000 మంది రైతులు నడిరోడ్డు మీదకు వచ్చారు. వారు కాలినడకన మార్చ్ పాస్ట్ చేసుకుంటూ థానే నుండి ముంబయికి బయలుదేరారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంతో ఈ మార్చ్ పాస్ట్ కార్యక్రమం మొదలైంది. ఈ ఉద్యమం రెండు రోజుల పాటు సాగుతుందని తెలిపిన రైతు సంఘాల నేతలు.. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని సోమయ్య మైదానానికి చేరుకొని నినాదాలు చేస్తామని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం ఈ మార్చ్ పాస్ట్ కార్యక్రమానికి ముగింపు ఆజాద్ మైదాన ప్రాంగణంలో జరుగుతుందని వారు చెప్పారు. లోక్ సంఘర్ష మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి స్వరాజ్య ఇండియా నేత యోగేంద్ర యాదవ్, సామాజిక వేత్త రాజేంద్ర సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే అనేకమంది రైతులు ముంబయికి తరలిరావడంతో ఆ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. 


ఈ సంవత్సరం మార్చిలో ఈ విధంగానే దాదాపు 50000 మంది రైతులు నాసిక్ నుండి ముంబయికి తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆ ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొనే ఇప్పుడు కూడా తాము థానే నుండి ఈ  కార్యక్రమాన్ని చేపట్టామని రైతు సంఘాల నేతలు తెలిపారు. శాంతియుతంగా చేసే ఈ మార్చ్ పాస్ట్ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదని.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికే ఈ ప్రయత్నమని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు జనతా దళ్ (ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీలు తెలిపాయి.