కర్నాటక హస్సన్ జిల్లాలోని ప్రముఖ జైన పుణ్యక్షేత్రం శ్రవణబెళగొళలో 88వ మహామస్తకాభిషేక ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. గవర్నర్ వాజుభాయి వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవగౌడ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రవణబెళగొళ జైనమఠాల అధిపతి చారుకీర్తి భట్టారక స్వామి, ఇతర జైన ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. బాహుబలి మూర్తికి ఫిబ్రవరి 17న మహామస్తకాభిషేకం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.


బుధవారం (ఫిబ్రవరి 7) నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో జైనులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. జైన క్యాలెండర్ ప్రకారం,12ఏళ్లకు ఒకసారి ఈ మహామస్తకాభిషేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా సుమారు ఐదువేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.