కేరళ వరదలు: 94కు చేరిన మృతుల సంఖ్య
గత పది రోజులుగా భారీ వర్షాలు, వరదల తాకిడితో కేరళ రాష్ట్రం అల్లాడుతోంది.
గత పది రోజులుగా భారీ వర్షాలు, వరదల తాకిడితో కేరళ రాష్ట్రం అల్లాడుతోంది. రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. వరద నీరు ఊర్లను ముంచెత్తడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి పైగా ప్రజలు పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. వరదల తాకిడికి గురువారం 30 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 94కు చేరింది.
శుక్రవారం భారత వాతారణ శాఖ మరోసారి కేరళకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో (కాసర్గోడ్ తప్ప) అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుందని వాతావరణ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ని అధికారులు మూసివేశారు. మెట్రో రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వందిపెరియార్‌లో వరదలో చిక్కుకున్న 16 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. అటు సహాయక చర్యల్లో 26ఎన్డీఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.
కేరళని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో ఒడిశా ప్రభుత్వం సహాయం ప్రకటించింది. కేరళ వరద బాధితులకు రూ.5కోట్లు సహాయాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
శనివారం ప్రధాని ఏరియల్ సర్వే
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కేరళలో ఏరియల్ సర్వే చేయనున్నారు. శుక్రవారం ఢిల్లీలో మాజీ ప్రధాని వాజ్‌పేయి అంత్యక్రియల అనంతరం ప్రధాని మోదీ.. కొచ్చి చేరుకోనున్నారు. రాత్రి కొచ్చిలోనే బస చేస్తారు. శనివారం వరద ప్రాంతాలను మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రధాని మోదీ రెండుసార్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తోనూ మాట్లాడారు.
'కొద్దిసేపటిక్రితమే కేరళ ముఖ్యమంత్రి పి.వి.విజయన్‌తో టెలిఫోన్ సంభాషణ జరిగింది. రాష్ట్రంలో వరద పరిస్థితి, రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మేము చర్చించాము. ఈ రోజు సాయంత్రం, నేను కేరళకు వెళుతున్నాను..' అని మోదీ ట్వీట్ చేశారు. తక్షణ సహాయం కింద ఇప్పటికే కేంద్రం వంద కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.