పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మార్చి 31, 2018 నాటికి అందరూ తమ ఆధార్ సంఖ్యను పాన్‌తో లింక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 కోట్లమంది పాన్ ఖాతాదారులు ఉండగా.. ఇప్పటికి కేవలం 13.5 కోట్లమంది మాత్రమే తమ ఆధార్ సంఖ్యను పాన్‌తో లింక్ చేసుకున్నారు.


ముఖ్యంగా చాలామందికి అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. అందుకే గడువు తేదిని పెంచామని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే అర్హులు కూడా తమ ఆధార్ సంఖ్యను తప్పక స్కీమ్‌తో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. ఆ విధంగా నమోదు చేసుకొనే గడువును కూడా మార్చి 31, 2018 వరకు పెంచాలని యోచిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.