ఆసుపత్రిలో చేరిన హార్దిక్ పటేల్
పటిదార్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ గత 14 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
పటిదార్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ గత 14 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఖోదాల్ ధామ్ ట్రస్టు ఛైర్మన్ నరేష్ పటేల్, హార్దిక్ పటేల్‌ని కలిసి దీక్షను విరమించాలని కోరారు. హార్దిక్ పటేల్ డిమాండ్స్‌ను రాష్ట్రప్రభుత్వం ముందు పెట్టి వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పిన మీదట హార్దిక్ పటేల్ దీక్షను విరమించారు. దీక్షను విరమించగానే.. హార్దిక్ పటేల్‌ను సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ వసోయా మాట్లాడుతూ.. హార్దిక్ పటేల్ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు కలగకుండా ఉండేందుకే దీక్ష తర్వాత.. తనను ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. ఆయన దాదాపు 10 కిలోల బరువు తగ్గారని.. నిన్న సాయంత్రం నుండి కనీసం నీళ్లు తాగడానికి కూడా ఒప్పుకోలేదని తెలిపారు. హార్దిక్ పటేల్‌ని ఆసుపత్రికి చేర్చగానే.. ఆ ఆసుపత్రి చుట్టూ జనాలు గుమిగూడారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు.. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆసుపత్రి చుట్టూ పోలీసు బలగాలను కూడా మొహరించడం జరిగింది.
పటిదార్ రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని.. అలాగే రైతు రుణాలను మాఫీ చేయాలని.. అలాగే తన సహధ్యాయి, పటిదార్ పోరాటంలో కీలక సభ్యుడు అల్పేష్ కతిరియాని జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ హార్దిక్ పటేల్ దీక్షకు కూర్చున్నారు. హార్దిక్ పటేల్ దీక్షకు కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, టీఎంసీ, ఎన్సీపీ నేతలు కూడా మద్దతిచ్చారు. బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హాతో పాటు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా కూడా హార్దిక్ పటేల్ దీక్షకు తమ మద్దతును తెలిపారు.