ఈ మధ్యకాలంలో ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆగస్టు 17వ తేదిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి అందరూ నివాళుర్పించి మౌనం పాటించాలని తీర్మానించారు. అయితే నివాళుర్పించి మౌనం పాటించాలా వద్దా? అన్న విషయాన్ని తప్పనిసరి చేయకూడదని.. అది సభ్యుల వ్యక్తిగత నిర్ణయానికి వదిలేయాలని ఏఐఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మాటిన్ తెలిపారు. తాను ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆయన ఆ మాటలు అన్న వెంటనే మిగతా బీజేపీ కార్పొరేటర్లు మాటిన్‌ను దూషిస్తూ ఆయనపై దాడికి తెగబడ్డారు. తర్వాత సెక్యూరిటీని పిలిపించి ఆయనను కార్పొరేషన్ బిల్డింగ్ నుంచి బలవంతంగా బయటకు పంపించారు. ఆ దాడిలో గాయపడిన సయ్యద్ మాటిన్ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. తర్వాత పోలీసులు ఆయనను అరెస్టు చేయడం జరిగింది. మున్సిపల్ సమావేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినందుకు ఆయనను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 


సయ్యద్ మాటిన్ అరెస్టు జరిగాక.. తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చారు. తాను ప్రజాస్వామయుతంగా ప్రవర్తిస్తూ.. నివాళుర్పించే పద్ధతికి వ్యక్తిగతంగా వ్యతిరేకినని తెలిపానని.. కాకపోతే బీజేపీ నేతలే తనపై దాడి చేశారని.. వారి పై చర్యలు తీసుకోవాలని సయ్యద్ అన్నారు. సయ్యద్ మీద దాడి జరిగిన తర్వాత ఏఐఎంఐఎం వర్కర్లు కొంతమంది బీజేపీ నేత బాబూరావు దేశముఖ్ ఇంటి మీద దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఘటనపై స్పందించిన సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారి డీఎస్ సింఘారే మాట్లాడుతూ... సయ్యద్ మాటిన్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని.. ఆయనను ప్రమాదకరమైన వ్యక్తిగా తాము పరిగణిస్తున్నామని.. మతవిద్వేషాలను రెచ్చగొట్టే పనులకు గతంలో కూడా ఆయన పాల్పడ్డారని తెలిపారు.