ఇండిగోపై ఎయిర్ ఇండియా ఛలోక్తులు
విమానయాన సంస్థ ఇండిగోపై ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతూ ఓ ఫోటో పోస్టు చేసింది. ఇటీవలే ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తమ ప్రయాణికునిపై దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్న ఘటనపై వేసిన సైటైర్‌గా దీనిని కొందరు భావిస్తున్నారు. "మేం చేతులెత్తేది నమస్కారం చేయడం కోసమే.. మా సేవలను ఎవరూ బీట్ చేయలేరు" అని అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ పెట్టి, నమస్కారం చేస్తున్న మహారాజు బొమ్మను పోస్టరుపై పబ్లిష్ చేసింది ఎయిర్ ఇండియా. తర్వాత ఈ పోస్టరును ట్విటర్‌లో కూడా పంచుకుంది. అయితే ఆ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే ఎయిర్ ఇండియా దానిని తొలిగించడం గమనార్హం. ఆ తర్వాత ఆ ఫోటో తాము పోస్టు చేయలేదని కూడా ఎయిర్ ఇండియా ప్రకటన జారీ చేసింది. అయితే అప్పటికే నెటిజన్లు ఆ ట్వీట్‌ను కొన్ని వందల సార్లు రీట్వీట్ చేశారు.. అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేశారు. ఇప్పటికే ప్రయాణికులకు నాణ్యమైన సేవలను ఇవ్వనందుకు ఇండిగోను బహిష్కరించాలని అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఈ క్రమంలో ఈ ట్వీట్ రావడం వివాదాస్పదమైంది.