అక్షయ్ కుమార్ చిత్రానికి బిల్‌గేట్స్ ప్రశంసలు..!
అక్షయ్ కుమార్ చిత్రానికి బిల్‌గేట్స్ ప్రశంసలు..!
మైక్రోసాప్ట్ సంస్థ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ "టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ" చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం.. మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరి అనే సామాజిక సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఈ చిత్రాన్ని నీరజ్ పాండే నిర్మించారు. ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన ‘స్వచ్ఛభారత్’ క్యాంపెయిన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది.
ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన బిల్‌గేట్స్ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. 2017లో తనలో స్ఫూర్తిని నింపిన అంశాల్లో ఈ చిత్రం కూడా ఒకటని గేట్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎడ్వర్డో సాంచెజ్ అనే నల్లజాతి యువకుడు తన కుటుంబంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి వ్యక్తినని ట్విట్టర్ ద్వారా తెలపడాన్ని తనలో స్ఫూర్తిని నింపిన మరో అంశమని గేట్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఆఫ్రికన్ సామాజిక వేత్త అకిన్ అడిసినాకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రకటించడం, భూటాన్‌లో తట్టు వ్యాధి పూర్తిగా నిర్మూలించబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం మొదలైనవి ఆయన ఫేవరెట్స్‌లో ఉన్నాయి.