కేరళ హైకోర్టు లవ్ జిహాద్ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మతాంతర వివాహాలన్నింటినీ "లవ్ జిహాద్"గా పరిగణించలేమని తెలిపింది. అయితే, బలవంతంగా మతమార్పిడులు చేయుట రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఓ మతాంతర వివాహం కేసులో కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది. ఓ ముస్లిం యువకుడు, ఓ హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొనే క్రమంలో, తనను మతం మార్పించాడని అందిన ఫిర్యాదుపై కోర్టు స్పందించింది. ప్రేమవివాహాలను ప్రోత్సహించాల్సిన తరుణంలో... అది మతాంతర వివాహమైతే,  దానిని మతకోణంలో నుండి చూడడం సాధ్యపడదని తెలిపింది. అయితే మత మార్పిడి కేంద్రాల ద్వారా మతాలు మార్చే ప్రక్రియలు చేపడితే అది చట్టవిరుద్ధమని తెలిపింది. ఇదే సంవత్సరం అక్టోబరు 7వ తేదీన కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును సంప్రదిస్తూ, ఇలాంటి కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలోనే ఈ కేసులు పరిష్కరిస్తే సరిపోతుందని తెలిపింది.