అక్రమంగా ఆవులను తరలిస్తున్నాడనే అనుమానంతో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రాంఘర్‌లో కొందరు వ్యక్తులు దాడి చేయడంతో అక్బర్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల నిర్లక్ష్యమే అతడి మృతికి కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గోవులు అక్రమంగా తరలిస్తున్నాడనే అనుమానంతో అక్బర్ ఖాన్‌పై కొందరు అల్లరిమూకలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. అతను అప్పటికి బతికే ఉన్నాడు. అతడిని పట్టుంచుకోకుండా తాపీగా టీ తెప్పించుకొని తాగుతూ కాలక్షేపం చేశారు' అని స్థానిక మానవహక్కుల కార్యకర్త తెలిపారు.  


అనంతరం పోలీసులు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించకుండా.. 10 కిలోమీటర్ల దూరంలోని గోశాలకు ఆవులను తరలించారని చెప్పారు. పోనీలే.. అప్పుడైనా పోలీసులు ఆసుపత్రికి తరలించారా? అంటే అదీ లేదు. బాధితుడిని గోశాల నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించి కస్టడీలో ఉంచుకున్నారని.. కొంత సమయం తరువాత ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఇక ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా.. పోలీసులు బాధితుడి తీసుకొచ్చేలోపు అతను మరణించాడని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ తన కథనంలో పేర్కొంది.


అయితే బాధితుడి మరణానికి పోలీసులు కారణమని ఆరోపణలు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. బీజేపీ ఎమ్మెల్యే అహుజా మాట్లాడుతూ, బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. పోలీస్ స్టేషన్‌కు తరలించి చావబాదారని.. అతడి మృతికి కారకులయ్యారని ఆరోపించారు. దీనిపై రాజస్థాన్ సీఎం వసుధరా రాజే సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు.