జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. భయాందోళనల్లో ప్రజలు
జమ్మూకశ్మీర్‌లో భూకంపం
జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. రాష్ట్రంలో పలు చోట్ల భూప్రకంపనల తీవ్రత కనిపించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ.. 'ఉదయం 8.09 గంటలకు స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. 36.7 ఉత్తర అక్షాంశం, 74.5 తూర్పు రేఖాంశం వద్ద 106 కోలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది' అని అన్నారు. అక్షాంశ రేఖాంశాల ప్రకారం, కరాకోరం పర్వతాలలోని ఖుంజేరాబ్ సబ్ సమీపంలో గిల్గిట్ ఉత్తరాన భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
గతంలో అక్టోబరు 8, 2005 న సంభవించిన భూకంపం కారణంగా లైన్ ఆఫ్ కంట్రోల్‌కు ఇరువైపులా 80,000మంది మరణించారు.