అమిత్ షా ర్యాలీలో 'బెంగాల్ వ్యతిరేకి బీజేపీ.. గో బ్యాక్' అంటూ పోస్టర్లు వెలిశాయి. శనివారం ఓ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతాకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో 'బెంగాల్ వ్యతిరేకి బీజేపీ.. గో బ్యాక్' అంటూ నగర ప్రధాన కూడళ్లలో, ముఖ్యంగా ర్యాలీ వేదికకు దగ్గరలో మాయో రోడ్ వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) పెట్టినట్లు కోల్‌కతా బీజేపీ శాఖ ఆరోపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


'మా ర్యాలీ వల్ల తృణమూల్ కాంగ్రెస్‌కు వణుకు పుట్టింది. దాంతో ఈ చర్యకు ఉపక్రమించింది. టీఎంసీకి రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్ర ప్రజలు బీజేపీ అందించే మంచిపాలన కోసం ఎదురుచూస్తున్నారు' అని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. అటు యాంటీ-బీజేపీ పోస్టర్లను తాము పెట్టలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియ మాట్లాడుతూ.. టీఎంసీ ఇలాంటి పోస్టర్లను ర్యాలీల్లో ఉంచడం ఇదే మొదటిసారి కాదని, జూన్‌లో అమిత్ షా పురూలియా పర్యటనలో కూడా ఇలాంటి పోస్టర్లనే పెట్టిందని, గతనెలలో ప్రధాని మోదీ ర్యాలీలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించిందని తెలిపారు. బహుశా.. ఆ పార్టీ(టీఎంసీ)రాష్ట్రానికి వచ్చే నేతలను ఇలానే ఆహ్వానిస్తుందేమో అని ఆయన చమత్కరించారు.


అటు ర్యాలీ వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు డ్రోన్‌ను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతినివ్వాలని నగర పోలీసులను బీజేపీ కోరగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. జులైలో మోదీ పర్యటన సమయంలో మిడ్నాపూర్‌లో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు బీజేపీ డ్రోన్ ఏర్పాటుకు అనుమతి అడిగింది. "ర్యాలీ వేదికపై డ్రోన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు" అని  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యన్తాన్ బసు అన్నారు. ర్యాలీ సందర్భంగా పార్టీ కార్యకర్తలు వాకీ-టాకీలను ఉపయోగించుకోవడానికైనా అవకాశం ఇవ్వాలని బీజేపీ పోలీసులను కోరింది.