ఏపీ బీజీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హరిబాబును కేంద్ర మంత్రిగా తీసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరికిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలకు తోడు పార్టీని ముందుండి నడిపించే సత్తా గల నాయకుడి కోసం కమలనాధులు దీర్ఘాలోచనలో పడిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరీ పేరే  బలంగా వినిపిస్తోంది. పురందేశ్వరీ అయితే పార్టీని సమర్ధవంతంగా నడిపించగలదనే పార్టీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెతో పాటు మరి కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎంపీ గోకరాజు రంగరాజు,  కన్నా లక్ష్మీ నారాయణ, కావూరి సాంబశివరావు,  సోము వీర్రాజు, మంత్రి మాణిక్యాల రావు , చల్లాపల్లి నరసింహారెడ్డి పేర్లు బీజీపీ అధ్యక్ష రేసులో ఉన్నట్లు సమచారం. వీరు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు..


చంద్రబాబు అంగీకరించేనా..


 పురందేశ్వరీకి బీజేపీ పగ్గాలు ఇస్తే దీనికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఏ మేరకు అంగీకరిస్తారనే చర్చ మొదలైంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష ఎన్నిక పార్టీ అంతర్గత విషమైనప్పటికీ ఎన్నికల సమయంలో సమన్వయంతో ముందుకు కదలాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బద్దశత్రువుగా ముద్రపడిన పురంధేశ్వరీకి పగ్గాలు ఇచ్చేంత ధైర్యం బీజేపీ చేస్తోందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతోంది. ఇదే గనుక జరిగితే వచ్చే ఎన్నికల్లో కమలనాధులు టీడీపీతో తెగదెంపులు చేసుకుంటారన్న వాదనకు బలం చేకూర్చినట్లవుతుంది. టీడీపీ దోస్తీ విషయంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై అధ్యక్ష ఎంపికతో తేలిపోతుంది.