ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీ నివాసం ఎదుట ధర్నా చేసిన టీడీపీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తుగ్లక్ రోడ్ ప్రాంతంలోని పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తానే స్వయంగా పోలీస్ ఠాణాకు వచ్చి టీడీపీ ఎంపీలను కలిసి మాట్లాడారు. తన సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంపీలను అరెస్టును కూడా ఆయన ఖండించారు.


ఆంధప్రదేశ్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంతో పాటు, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కేజ్రీవాల్ తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా కూడా తెలిపారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ భవన్‌కు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి అల్పాహార విందులో కూడా పాల్గొన్నారు