కర్ణాటకలో బీజేపీ ఆధిక్యం సొంతం చేసుకోవడంతో హస్తినలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిన్నబోయింది. కర్ణాటకలో ఎన్నికల పోరు హోరాహోరిగా కొనసాగింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఇకపై కాంగ్రెస్ పార్టీకి ఓటమి అనేది వుండబోదు. అంతా గెలుపే అని బల్ల గుద్ది మరీ ధీమా వ్యక్తంచేశారు. కానీ ఫలితాల తీరు మాత్రం రాహుల్ గాంధీ ధీమాకు విరుద్ధంగా వెలువడింది. పార్టీ వెనుకంజ వేయడం చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. పార్టీ కార్యకర్తల్లోనే కాకుండా.. ఇప్పటివరకు రాహుల్ గాంధీ పట్ల భక్తి భావం ప్రదర్శించిన వారిలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై జీ న్యూస్‌తో మాట్లాడిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు ఇంకా విశ్వాసం వున్నప్పటికీ, ప్రియాంకా గాంధీ వాద్రాకు కూడా పార్టీలో ఇకనైనా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం వుంది అని అభిప్రాయపడ్డారు. 


ఇదే విషయమై మరొక కార్యకర్త మాట్లాడుతూ... తాను ఎప్పుడూ రాహుల్ గాంధీకి అండగానే నిలబడ్డాను. ఇప్పుడు కూడా రాహుల్‌తోనే వుంటాను. కానీ పార్టీలో ప్రియాంకా గాంధీ వాద్రాకు సరైన స్థానం కల్పించాల్సిన అవసరం కూడా వుంది అని అన్నారు. కర్ణాటకలో పార్టీ గెలుస్తుందనే విశ్వాసంతో పార్టీ కార్యాలయం వద్ద గుమిగూడిన కొంతమంది కార్యకర్తలు సదరు కార్యకర్త అభిప్రాయంతో ఏకీభవించడం గమనార్హం. 


కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించాలి అనే డిమాండ్ ఇవాళ కొత్తదేమీ కాదు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ డిమాండ్‌ని విననట్టుగానే ముందుకెళ్తోంది. మరోవైపు ప్రియాంకా గాంధీ సైతం పార్టీలో వినిపిస్తున్న డిమాండ్‌పై స్పందించకుండా ఇంటికే పరిమితమవుతూ వస్తున్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయంతో ఏకీభవించి 2019 ఎన్నికల వరకైనా ప్రియాంకా గాంధీకి పార్టీలో సముచిత స్థానం ఇస్తారో లేదో చూడాలి మరి.