జోద్‌పూర్: అన్ని రౌండ్ల ఫలితాలు వెల్లడైతే కానీ ఏ నేతకు ఎంత మెజార్టీ వచ్చిందనే విషయాన్ని చెప్పలేం. అటువంటిది ఫలితాల వెల్లడి అవడానికన్నా ఒక రోజు ముందే రాజస్తాన్‌లో ఓ విచిత్రమైన సీన్ కనిపించింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్దార్‌పుర నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 30,000లకుపైగా మెజారిటీతో గెలిచినట్టు నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. తమ ప్రియతమ నాయకుడు అశోక్ గెహ్లాట్‌కి అభినందనలు చెబుతున్నట్టుగా వెలిసిన పోస్టర్లు చూసి జనం అవాక్కయ్యారు. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడకముందే మెజారిటీతో సహా ఫలితాన్ని ఎలా చెబుతారని ఓటర్లు అయోమయంలో పడ్డారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పార్టీ కార్యకర్తలు ఆ పోస్టర్లను తొలగించినట్టు తెలుస్తోంది. 


సర్దార్‌పుర అశోక్ గెహ్లట్ సొంత నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచే అశోక్ నాలుగుసార్లు అసెంబ్లీకి ఎంపిక అయ్యారు. 2013 ఎన్నికల్లో అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రిగా వున్న కాంగ్రెస్ సర్కార్‌పైనే బీజేపీ విజయం సాధించి వసుంధరా రాజే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకన్నా ముందుగా రెండుసార్లు కేంద్ర సహాయ మంత్రిగా, మరోసారి కేంద్రమంత్రిగా అశోక్ గెహ్లట్ సేవలు అందించారు.