కాశ్మీరు వేర్పాటువాది మరియు హురియత్ నేత సయ్యద్ అలీషా జిలానీ కాశ్మీర్ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ పిల్లలను ఎవరూ ఆర్మీ పాఠశాలలకు పంపించవద్దని హితవు పలికారు. ఆర్మీ పాఠశాలల వల్ల ముస్లిం మతానికి, సంప్రదాయానికి తీరని అన్యాయం జరుగుతుందని... అక్కడ పిల్లలకు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా బోధించే అవకాశం ఉందని ఆయన మండిపడ్డారు.


పిల్లలను ఆర్మీ పాఠశాలలకు పంపించే బదులు.. ఏ ఇతర ప్రముఖ ప్రైవేటు పాఠశాలలకు పంపించినా, తనకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు చిన్న చిన్న అత్యాశలకు పోయి.. డబ్బు తక్కువ ఖర్చు అవుతుందని భావిస్తూ.. ఆర్మీ స్కూళ్ళలో తమ పిల్లలను చేరుస్తున్నారని.. అయితే ఇలా చేయడం వల్ల రేపటి తరం పూర్తిగా సంప్రదాయాలకు దూరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో విద్యావ్యవస్థ ప్రస్తుతం బ్రిటీష్ వారి పద్ధతులనే అనుసరిస్తుందని.. ఆ వైఖరి మారాలని కూడా జిలానీ తెలిపారు.