ఆసన్‌సోల్‌: పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు 4వ విడత పోలింగ్ జరుగుతున్న ఆసన్‌సోల్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడి అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, బీజేపి కార్యకర్తలకు మధ్య చోటుచేసుకున్న వాగ్వీవాదం ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణల్లో ఆసన్‌సోల్‌ లోక్ సభ స్థానం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న బాబుల్ సుప్రియో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీఎంసి పోలింగ్ ఏజెంట్స్, నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద రిగ్గింగ్ చేస్తున్నారని బాబుల్ సుప్రియో ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే ఉందని, టీఎంసీ నేతలు గుండాగిరి చేస్తూ బీజేపి మద్దతుదారులని ఓటు హక్కు వినియోగించుకోకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బాబుల్ మండిపడ్డారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, మరోవైపు బాబుల్ సుప్రియోనే 12 మంది గూండాలను వెనకేసుకొచ్చి పోలింగ్ కేంద్రంలో హింసకు కారణమయ్యారని ఆరోపిస్తూ టీఎంసి తరపున పోలింగ్ ఏజెంట్ జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆసన్‌సోల్ లోక్ సభ స్థానం నుంచి టీఎంసి అభ్యర్థిగా అలనాటి ప్రముఖ సినీ నటి మున్‌మున్ సేన్ బరిలో నిలిచారు. మరోవైపు ఈ ఘర్షణలను కవరేజ్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ ప్రతినిధి పూజా మెహతాపై సైతం దాడికి యత్నించిన దుండగులు ఆమె కారు అద్దాలను ధ్వంసం చేశారు.