విస్మయం గొలిపే వాస్తవాలను వెల్లడించిన ఆర్బీఐ
పీఎన్‌బీ బ్యాంక్ కుంభకోణం వెలుగుచూసిన తరువాత మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగుచూసిన తరువాత మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఉద్యోగులు కుంభకోణాల్లో పాల్గొంటున్నారని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. విస్మయం గొలిపే విషయం ఏమిటంటే, ప్రతి 4 గంటలకు ఓ బ్యాంక్ ఉద్యోగి మోసాలకు పాల్పడి పట్టుబడుతున్నారని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ తయారుచేసిన ఒక డేటా ప్రకారం, దేశంలో ప్రతి నాలుగు గంటలకు ఓ బ్యాంకు ఉద్యోగి ఫ్రాడ్ కేసులో పట్టుబడి శిక్షకు గురవుతున్నారు.
రెండు సంవత్సరాలలో 5200 మంది ఉద్యోగులు పట్టుబడ్డారు
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన వార్తల ప్రకారం, ఆర్బీఐ జనవరి 1, 2015 నుంచి మార్చి 31, 2017 మధ్యకాలంలో నమోదైన ఫ్రాడ్ కేసుల్లో 5200 మంది ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు దోషులుగా తేలి శిక్షలకు గురయ్యారని వెల్లడించింది.
నేరస్థులపై చర్యలు తీసుకున్నారు
ఆర్బీఐ నివేదిక ప్రకారం, ఈ కేసులలో దొరికిన ఉద్యోగులను దోషులుగా ప్రకటించి, జరిమానా విధించారు. ఉద్యోగం నుండి తొలగించేశారు. ప్రస్తుతం ఆర్బీఐ ఏప్రిల్ 2017 నుండి డిసెంబరు వరకు డేటా సిద్ధం చేస్తోంది.
ఫ్రాడ్ కేసుల్లో ఎస్బీఐ ఉద్యోగులు టాప్
దోషులుగా తేలిన 5200 మంది బ్యాంకు ఉద్యోగుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులు అధికంగా ఉన్నారు. అందులో 1538 మంది ఎస్బీఐ ఉద్యోగులు దోషులుగా ఉన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగులు 449 మంది , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు 406 మంది, యూనియన్ బ్యాంకు ఉద్యోగులు 214 మంది, పీఎన్‌బీ బ్యాంక్ ఉద్యోగులు 184 మందితో పాటు ఇతర బ్యాంకులకు చెందిన మరికొందరు బ్యాంకు ఉద్యోగులు 2409 మంది దోషులుగా ఉన్నారు.
ఇలాంటి కేసుల్లో వేలాదిమంది బ్యాంకు ఉద్యోగులు పట్టుబడుతుండడం, శిక్షలకు గురవుతుండడంతో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వారిపై ఓ కన్నేసేలా ప్రత్యేకంగా ఓ నిఘా వ్యవస్థను తయారుచేసుకోవాలంటూ అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.