జాతీయస్థాయిలో పేరుగాంచిన బీజేపీ సీనియర్ నేత దారుణ హత్య
జమ్మూ కాశ్మీర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్ దారుణ హత్యకు గురయ్యారు.
జమ్మూ కాశ్మీర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్ దారుణ హత్యకు గురయ్యారు. కిష్త్వార్ జిల్లాలో పలువురు దుండగులు వీరిపై దాడి చేసి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అనిల్ పరిహార్.. ఘటనా స్థలంలో కుప్పకూలిపోగా.. అజిత్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే ఇది కచ్చితంగా తీవ్రవాదుల పనేనని బీజేపీ కార్యదర్శి అశోక్ కౌల్ తెలిపారు. మరోవైపు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని.. హంతకులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్ఎస్పీ రాజీందర్ గుప్తా తెలిపారు.
హత్య వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దర్యాప్తును వేగివంతరం చేయాలని ఇంటెలిజెన్స్ వర్గాలను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. కాగా.. అనిల్ పరిహార్ సోదరులను హత్య చేశారన్న విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం కిష్త్వార్ జిల్లాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. జనాలు వీధుల్లోకి వస్తే.. అరెస్టు చేస్తున్నారు.
52 సంవత్సరాల అనిల్ పరిహార్ పై కాల్పులు జరిపాక.. ఆయన చాలా సేపు రక్తపు మడుగులో రోడ్డుపైనే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీజేపీ పార్టీ కాశ్మీర్ ప్రాంతంలో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించిన నాయకుల్లో పరిహార్ కూడా ఒకరు. పరిహార్ మరణం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా ఈ విషయంపై స్పందించారు. దుండగులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.