CAB 2019 | అస్సాంలో అల్లర్ల నేపథ్యంలో రామ్ మాధవ్ ప్రకటన
ఎన్డిఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు చట్టం 2019 ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో అస్సాంలో ఆందోళనకారులు రోడ్డెక్కి ఉద్యమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా అస్సాంలో పలుచోట్ల విధ్వంసకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు చట్టం 2019 ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో అస్సాంలో ఆందోళనకారులు రోడ్డెక్కి ఉద్యమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా అస్సాంలో పలుచోట్ల విధ్వంసకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పౌరసత్వ సవరణ బిల్లు చట్టం 2019పై బీజేపి జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వలన అస్సాం ప్రజల సంస్కృతి, సాంప్రదాయలను కాపాడుతుందని పౌరులకు రక్షణ కల్పిస్తుందని పునరుద్ఘాటించారు. అస్సాంలో అల్లర్లు, అసంతృప్తి నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. ఈ బిల్లుతో ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పారని రామ్ మాధవ్ గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఈ బిల్లు విషయంలో బీజేపి వైఖరిపై రామ్ మాధవ్ మాట్లాడుతు.. అస్సాంలో నిబంధన 6ను పూర్తి స్థాయిలో అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్రియను పటిష్టంగా ముందుకు తీసుకెళుతుందని, పూర్తి స్థాయి పౌర రక్షణ, భాషా పరిరక్షణకు, అస్సాం ఆచారాలు కాపాడుతుందని అన్నారు. ఈ బిల్లుపై వచ్చే వ్యతిరేక ప్రచారాలను, నమ్మవద్దని, ప్రజలు అనవసరమైన ఆందోళనలకు గురికావద్దని సూచించారు. ప్రజలు శాంతి పాటించాలని, అసత్య ప్రచారాలకు ఆకర్షితులు కావద్దని అన్నారు. బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ చట్టం బిల్లు ఆమోదం పొందగా, ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125 మద్దతు తెలుపగా 105 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన తరవాత అస్సాంలో డిబ్రుగర్హ్‌లో అల్లర్ల నేపథ్యంలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.