న్యూఢిల్లీ: లోక్ సభ తొలి విడుత ఎన్నికలకు మరో మూడురోజులే మిగిలివున్న నేపథ్యంలో నేడు భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గత ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సర్కార్ సాధించిన  విజయాలను ఈ మేనిఫెస్టోలో ప్రస్తావించిన ఆ పార్టీ రానున్న ఐదేళ్ల కోసం తాము చేయబోయే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, నిరుపేద నిర్మూలన కార్యక్రమాలను వివరించింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ సహా పార్టీకి చెందిన ఇతర అగ్రనేతల సమక్షంలో బీజేపి ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భారత్ ఒక మహాశక్తిగా అవతరించిందని.. 2004 నుంచి 2014 వరకు ప్రపంచం దృష్టిని ఆకర్షించని భారత్.. తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత భారత్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. 


బీజేపీ విడుదల చేసిన 2019 మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు:
రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, వడ్డీలేని రైతు రుణాలు, రూ.1 లక్ష వరకు సున్నా వడ్డీతో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు
దేశంలో ఇళ్ల లేని నిరుపేదలు అందరికీ 2022 నాటికి పక్కా ఇంటి నిర్మాణం.
సైనిక బలగాల శక్తిని పెంపొందించేందుకు అవసరమైన రక్షణ సామగ్రిని త్వరితగతిన కొలుగోలు చేయడం
దేశాభివృద్దిని తొక్కిపెడుతున్న తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను కొనసాగించడం
దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దశల వారీగా జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేయడం
ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ ఫెన్సింగ్ సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370తో పాటు ఆ రాష్ట్ర ఆస్తులపై బయటివారికి హక్కు లేకుండా చేసే ఆర్టికల్ 35-ఏ రద్దుకు కట్టుబడి ఉండడం.
130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేయడమే లక్ష్యంగా ‘సంకల్ప పత్రాన్ని’ అమలు చేయడం
బీజేపీ అధికారంలోకి రాగానే రామ మందిర నిర్మాణం 
2024 నాటికి మౌళిక రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంతో అభివృద్ధిపనులు.