సోనాలి బింద్రే మరణించారని ఎమ్మెల్యే ట్వీట్.. ఆపై క్షమాపణ
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. హైగ్రేడ్ క్యాన్సర్‌తో న్యూ యార్కులో చికిత్స పొందుతున్న నటి సోనాలి బింద్రే మరణించారని.. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి దానిని ట్వీట్టర్‌లో షేర్ చేశారు.
కదమ్‌కు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లో.. ‘‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు’’ అని ఉంది. ఈ వార్తలో నిజమెంతుందో అని నిర్ధారించుకోకుండా.. ఎమ్మెల్యే ఆ వార్తను షేర్ చేసి చిక్కుల్లో పడ్డారు. దాంతో అభిమానులు రామ్ కదమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన రామ్ కదమ్ తన ట్వీట్‌ను తొలగించి, క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి బింద్రే గురించి వచ్చినదంతా అవాస్తవం. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇటీవలే రామ్ కదమ్తన నియోజకవర్గంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే..!