భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకమైన 'అయుష్మాన్ భారత్'ను మోదీ ప్రారంభించిన సందర్భంగా సౌందరరాజన్.. ఆయన పేరును నోబెల్ పురస్కారానికి నామినేట్ చేశారు. ప్రజలు కూడా ప్రధాని మోదీ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


'ఆయుష్మాన్ భారత్' అనేది ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కిందకు వచ్చే ఒక ఆరోగ్య పథకం.


జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన కార్యక్రమంలో శనివారం నాడు  మోదీ  'ఆయుష్మాన్ భారత్'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. దేశంలో నిరుపేదలకు ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన వరమని మోదీ అన్నారు. ఈ తరహా భారీ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయగలిగిందని చెప్పారు.


ప్రధాన మంత్రి ప్రకారం, ఈ పథకంలో 13,000 కన్నా ఎక్కువ ఆస్పత్రులు చేరాయి. ఈ పథకం అమలుకు సంబంధించిన ట్రయిల్ ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందని ఆయన అన్నారు.


ఈ పథకం 'సబ్కా సాత్ సబ్కా వికాస్' అనే కాన్సెప్ట్‌పై ఆధారపడినదని ప్రధాని చెప్పారు. ఈ పథకంలో కులం, మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఎదుర్కోబోరని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 14555 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ఈ పథకం గురించిన సమగ్ర సమాచారం దేశంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకై mera.pmjay.gov.in వెబ్‌సైట్‌‌లో చూడవచ్చు.


కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌ కావడం గమనార్హం. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మంది ప్రజలకు 'ఆయుష్మాన్ భారత్' వర్తిస్తుంది. లబ్దిదారులు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వం సూచించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా.. వారి వయసుతో నిమిత్తం లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.