Lok Sabha Elections 2024: 350 స్థానాల్లో విజయమే లక్ష్యంగా.. లోక్‌సభ ఎన్నిలకు బీజేపీ యాక్షన్ ప్లాన్..!
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
BJP Target to win 350 Lok Sabha Seats: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో ఏకంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 350 కంటే సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పార్టీ అన్ని అంశాలపై కసరత్తు చేస్తోంది. కమలం పార్టీ తనకు గట్టి పట్టున్న స్థానాలతో పాటు ఈసారి సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, శరద్ పవార్, ప్రముఖ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలపై కూడా కన్నేసింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని స్థానాలను ఈసారి ఛేజిక్కించుకోవాలని బీజేపీ పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అదేవిధంగా 2019లో రాణించలేకపోయిన దక్షిణా రాష్ట్రాలపై కూడా పార్టీ కన్నేసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ప్రత్యేక లిస్ట్‌ను బీజేపీ సిద్ధం చేసింది. ఇందులో బీజేపీ సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన స్థానాలు, చాలా తక్కువ తేడాతో ఓడిపోయిన స్థానాలను ప్రత్యేకంగా గుర్తించింది. ఈ జాబితాలో మొత్తం 160 స్థానాలు ఉన్నట్లు తేలింది. ఈ స్థానాలను గ్రూపులుగా విభజించి.. ఇక్కడ పార్టీ బలోపేతం దృష్టిసారించనున్నారు. ఈ బాధ్యతను కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించారు. దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్లు, కో-కన్వీనర్లను నియమించారు.
'లోక్‌సభ ప్రవాస్ యోజన'తో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను పార్టీ ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లకు అప్పగించారు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ఇప్పటివరకు చేసిన పనిని సమీక్షించారు. క్లస్టర్ ఇంఛార్జీలకు కూడా ఆయన ముఖ్య సూచనలు చేశారు.
కేవలం బలహీనంగా స్థానాల్లోనే కాకుండా.. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల గెలుపు కోసం బీజేపీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. మొట్టమొదటిసారిగా కింది స్థాయిలో తన వ్యూహాలకు పదునుపెడుతోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తూర్పు ప్రాంతం, ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతంగా మూడు విభాగాలుగా విభజించింది.
పార్టీ తూర్పు ప్రాంతంలో 12 రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపురలను చేర్చింది. ఉత్తర ప్రాంతంలో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను చేర్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ-కాశ్మీర్, లడఖ్, చండీగఢ్, డామన్ డయ్యూ-దాద్రా నగర్ హవేలీ ఉన్నాయి.
దక్షిణ ప్రాంతంలో 11 రాష్ట్రాలు, యూటీలను చేర్చింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 129 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో బీజేపీకి కేవలం 29 సీట్లు మాత్రమే ఉన్నాయి. కర్ణాటకలో 25 సీట్లు, తెలంగాణలో నాలుగు సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కర్ణాటకలో తన ఉనికిని కాపాడుకుని.. తెలంగాణలో సీట్లు పెంచుకోవడంతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాతాలు తెరవడంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!
Also Read: Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం.. రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి