కర్ణాటక రాజకీయాలు: `ప్లాన్-బి`కి సిద్ధమవుతున్న బీజేపీ
కర్ణాటక రాజకీయాలు: `ప్లాన్-బి`కి సిద్ధమవుతున్న బీజేపీ
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య తగువుపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్-బికి సిద్ధమయినట్లు జాతీయ మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇలాంటి వ్యూహాన్ని బీజేపీ బీహార్‌లో అమలు చేసి విజయం సాధించింది అని పేర్కొన్నాయి. కేబినేట్ పదవుల విషయంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేసి తమ పార్టీలోకి లాగాలని బీజేపీ భావిస్తోందట. అయితే 10 నెలల వ్యవధిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది.
వారి గొడవలే కలిసొస్తాయి
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు ఎంతో కాలం నిలవదని, కూటమిలో ఏర్పడే సహజసిద్ధ గొడవలతో మళ్లీ బీజేపీకే అధికార పగ్గాలు దక్కుతాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మేం పోరాటంలో ఓడి ఉండొచ్చు. కానీ, యుద్ధంలో గెలుస్తాం’ అని ఒక నేత 2019 ఎన్నికలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు కర్ణాటకలో రాజకీయ ప్రత్యర్థులని.. మనస్పర్థలు వస్తాయని.. ఆ కూటమి ఎంతో కాలం నిలవదని జోస్యం చెప్పారు.