తూర్పు మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని రూప్‌నారాయణ్ నదిలో సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా మునిగిపోయింది. మయాచార్ నుంచి అమృత్‌బెరియాకు వెళ్తుండగా.. మాయచార్-దనిపూర్ మధ్య సోమవారం ఉదయం 9:30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు. పోలీసులతోపాటు గజ ఈతగాళ్ల బృందంతో కలిసి కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా సహాయచర్యల్లో పాల్గొంటున్నారని పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి సుబెందు అధికారి తెలిపారు. 


ఈ దుర్ఘటనలో 38 మందిని రక్షించగా మరో ఇద్దరు గల్లంతయ్యారని జిల్లా మెజిస్ట్రేట్ పార్థ ఘోష్ ప్రకటించారు. నది తీరానికి దగ్గరలో ప్రమాదం చోటుచేసుకోవడంతో చాలా మంది ప్రయాణికులు తీరానికి ఈదుకుంటూ వచ్చారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. లైసెన్స్ కూడా లేకుండానే, ప్రతికూల వాతావరణంలో, మోతాదుకు మించి ప్రయాణికులను పడవలో ఎక్కించుకున్నందుకు పడవ యజమాని లక్ష్మణ్ పాల్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు మంత్రి సుబేందు అధికారి పేర్కొన్నారు.