బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం, బిజేపి శాసనసభా పక్ష నేత బిఎస్ యడ్యూరప్ప శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపి విభాగం తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండటం ఇది నాలుగోసారి. శుక్రవారం ఉదయం 10 గంటలకు కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసిన బిఎస్ యడ్యూరప్ప.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపి సిద్ధంగా ఉందని, అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. యడ్యూరప్ప విజ్ఞప్తికి గవర్నర్ నుంచి సానుకూల స్పందన లభించడంతో బీజేపికి మార్గం సుగుమమైంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన బల పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, అంతకన్నా ముందుగానే శాసనసభకు రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ గురువారం అనర్హత వేటు వేశారు. అంతేకాకుండా రాజీనామా చేసిన మిగితా 14 మంది ఎమ్మెల్యేల విషయంలోనూ తాను త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే బీజేపి నేత బిఎస్ యడ్యూరప్ప ఆ రాష్ట్ర గవర్నర్‌ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.