బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు విషయమై బీజేపి అధ్యక్షుడు అమిత్ షా, బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాలతో భేటీ అయి చర్చించేందుకు కర్ణాటక బీజేపి అగ్రనేతలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, జె క్రూ మధుస్వామి, అరవింద్ లింబావలి వంటి నేతలు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 99 ఓట్లు లభించగా ప్రధాన ప్రతిపక్షమైన బీజేపికి 105 ఓట్లు నమోదయ్యాయి. దీంతో అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారం కోల్పోయిన 24 గంటల్లోగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపి ముందుకు వస్తుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఎక్కువ మెజారిటీ లేకుండా అధికారాన్ని చేజిక్కించుకోకూడదని బీజేపి అధినాయకత్వం ఆలోచనలో పడటమేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందినట్టయితే, ఆయా స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ బీజేపినే విజయం సాధించిన తర్వాత అధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని బీజేపి అధిష్టానం భావిస్తోందట. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం, ప్రస్తుతానికి కావాల్సినంత మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపి అధిష్టానం తొందరపడటం లేదని సమాచారం.
Delhi: Karnataka BJP leaders Jagadish Shettar, Basavraj Bommai, Arvind Limbavali and others reach Delhi. They will meet Home Minister Amit Shah and party working President JP Nadda later in the day. The Congress-JD(S) government lost the trust vote on July 23. pic.twitter.com/hhyjSXTu3Y
— ANI (@ANI) July 24, 2019
అయితే, మెజారిటీతో వచ్చే సమస్యేం లేదని బీజేపి అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నంలో కర్ణాటక బీజేపి అగ్రనేతలు ఉన్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, బీజేపి శాసనసభా పక్ష నేతగా ఉన్న బిఎస్ యడ్యూరప్ప ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఒకవేళ మెజారీటీనే సమస్యగా భావించినట్టయితే, ఇప్పటికే ఇంకొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, వారంతా కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపి టికెట్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బిఎస్ యడ్యూరప్ప అధిష్టానానాకి తెలియజేశారు. అదే కానీ జరిగి ఉప ఎన్నికల్లో బీజేపి టికెట్‌పై పోటీ చేసిన అభ్యర్థులను పార్టీ గెలిపించుకోగలిగితే, పార్టీకి అధిక మెజారిటీ ఖాయం అనేది బిఎస్ యడ్యూరప్ప అభిప్రాయం. ఈ నేపథ్యంలో నేడు కర్ణాటక బీజేపి అగ్రనేతలతో చర్చించిన అనంతరం బీజేపి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందా అనేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.