ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం.. మరో 14 మందికి వార్నింగ్!

కర్ణాటకలో శాసనసభకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Jul 26, 2019, 04:31 PM IST
ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం.. మరో 14 మందికి వార్నింగ్!

బెంగళూరు : కర్ణాటకలో శాసనసభకు రాజీనామా చేసిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, రమేష్ జర్కిహోలి, మహేష్ కుమటల్లిలపై అనర్హత వేటు వేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్.. 2023 వరకు వాళ్లు ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఈ ముగ్గురి రాజీనామాలు సరైన పద్ధతిలో లేనందునే వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు స్పీకర్ తేల్చిచెప్పారు. జూన్‌లో కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్.. తాను బీజేపికి మద్ధతిస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారని స్పీకర్ వెల్లడించారు. అలాగే మరికొద్ది రోజుల్లో మిగతా 14 మంది ఎమ్మెల్యేలపై సైతం తాను ఓ నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చేసిన ప్రకటన ప్రస్తుతం వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. తాను తీసుకునే నిర్ణయం వారి రాజీనామాలను ఆమోదించడమైనా కావొచ్చు లేదా అనర్హులుగా ప్రకటించడమైనా కావొచ్చునని స్పీకర్ వ్యాఖ్యానించడమే అందుకు కారణం. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆర్ శంకర్ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని మాజీ సీఎం సిద్దరామయ్య సైతం ఓ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు రావు స్వాగతించారు. స్పీకర్ తీర్పుని స్వాగతిస్తున్నామని ప్రకటించిన గుండు రావు.. ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యం గెలుపుగా అభివర్ణించారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో మద్దతు లభించకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోగా ఆ తర్వాత రెండు రోజులకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం కర్ణాటకలో రాజకీయం మరోసారి వేడెక్కింది.

Trending News