ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బలనిరూపణకు ముందే తప్పుకున్న బీఎస్ యడ్యూరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. మే 12న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. ‘విజయ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలోని తాత్కాలిక షెడ్డులో ఓటర్ నమోదు ధ్రువీకరణ మెషిన్లు(వీవీపీఏటీ) దర్శనమిచ్చాయంటే ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈసీ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని యడ్యూరప్ప లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందే బీజేపీ దీనిపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఈసీ పట్టించుకోలేదని యడ్యూరప్ప గుర్తు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలను ఈసీ దృష్టికి తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నో అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది’’ అని యడ్యూరప్ప పేర్కొన్నారు.


వీవీపీఏటీ ఈవీఎంలను పెంచాలి: మాజీ సీఈసీలు


ఈవీఎంలపై రాజకీయ పార్టీల విమర్శలకు బదులిచ్చేలా రసీదు వచ్చే యంత్రాల ఉపయోగించాలని కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ బూత్‌లోనే ఈ మెషిన్ అందుబాటులో ఉండగా..వీటిని 5 శాతం వరకు పెంచాలని సీఈసీతో జరిగిన భేటీలో మాజీ అధికారి నజీం జైదీ సూచించారు. అటు ఎన్నికల సమయంలో కేవలం కొత్త పథకాలు, ప్రాజెక్టులను అడ్డుకోవాలని సాధారణ పాలనను అడ్డుకోవద్దన్నారు.