రిలయన్స్ జియో మార్కెట్‌లోకి వచ్చాక టెలికాం కంపెనీల మధ్య ప్రత్యక్ష యుద్ధమే నడుస్తోంది. తమ కస్టమర్లను జియో వైపుకు వెళ్లకుండా ఉండటానికి టారిఫ్‌లను, సరికొత్త ప్లాన్‌లను అందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) బంపరాఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది.


రూ.155కే నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది. గతంలో ప్రమోషనల్ ఆఫర్ కింద కేవలం కొద్ది మంది కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఆ ఆఫర్‌ను తొలగించి కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.155 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా చొప్పున 17రోజుల వ్యాలిడిటీకి గాను 34 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ రీఛార్జికి ఎటువంటి గడువు తేదీ లేదు. బహిరంగ మార్కెట్‌లో లభిస్తోంది. రూ.149కే 28 రోజులకు గానూ వరుసగా రోజూ 1.5GB డేటాను అందిస్తున్న జియో ఆఫర్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.