యూపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న  రాజకీయ పార్టీలు .. ఆ దిశగా ముందుకు వెళ్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసిపోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే బీఎస్పీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. ఇదే అంశం బీజేపీకి కలిసి వచ్చింది. హిందుత్వ నినాదంతో ఆ పార్టీ గెలుపుబావుట ఎగురవేసింది. బీఎస్పీ ఓట్లు చీల్చడం వల్లే చాలా చోట్ల ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఓటమి చవిచూసింది. అలాగే బీఎస్పీ కి గెలుపుకు అవకాశమున్న ప్రాంతాల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకును చీల్చాయి. ఈ పరిణామాలతో మేల్కొన్న రాజకీయ పార్టీలు బీజేపీని గద్దెదించేందుకు ఏకతాటిపై వచ్చేందుకు నిర్ణయించుకున్నాయి. తాజాగా బీఎస్పీ కూడా ఎస్పీ,కాంగ్రెస్ తో దోస్తీ చేసేందుకు ముందుకు వస్తోంది. 


ఎస్పీతో దోస్తీకి బీఎస్పీ సై...
యూపీలోని 2 లోక్‌సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థి అయిన సమాజ్‌వాది అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని..అందుకని తాము అభ్యర్థులను నిలబెట్టడం లేదని మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ ఆదివారం చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. మాయ ప్రకటనతో 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు ఓ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలవడుతున్నాయి. ఇదే జరిగితే బీజేపీకి ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. అయితే తాజా పరిణామాలను బీజేపీ నేతలు ఖాతరు చేయడం లేదు..మోడీ చరిష్మాతో ఇవ్వన్ని కొట్టుకుపోతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.