లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఇస్లామ్ విరుద్ధమా..!
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఇస్లామ్ మతానికి విరుద్ధమని పలు ముస్లిం సంఘాలు ఫత్వా జారీ చేశాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఇస్లామ్ మతానికి విరుద్ధమని పలు ముస్లిం సంఘాలు ఫత్వా జారీ చేశాయి. జీవితానికే కాదు.. ఆస్తులకు కూడా బీమా చేయించడం మతానికి విరుద్ధమని ఈ సంఘాలు తెలిపాయి. ముస్లిం పౌరులు భగవంతుడైన అల్లాపైనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి తప్పితే.. బీమా కంపెనీలపై కాదని ఆ సంఘాలు స్పష్టం చేశాయి.
ఘజియాబాద్ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో ఓ ముస్లిం పౌరుడు అడిగిన ఓ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇస్తూ.. ఈ ఫత్వాని జారీ చేశారు. ఈ ఫత్వాకి కారణాలు కూడా వారు తెలిపారు. జనన, మరణాలు అల్లా చేతిలో ఉంటాయని.. ఇన్సూరెన్స్ కంపెనీల చేతులలో కాదని వారు తెలిపారు.
ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా.. ప్రజలు పెట్టే పెట్టుబడిపైనే వడ్డీలు సంపాదిస్తాయి కాబట్టి.. వడ్డీ పై ఆదాయం ఇస్లాంలో నిషిద్ధం కనుక, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం కూడా నిషిద్ధమేనని ఆయా ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి. యూపీకి చెందిన దియోబంద్ ఉలేమాలు ఈ ఫత్వాని జారీ చేశారు.