ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనానికి కేంద్రం ఆర్డినెన్స్
ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదిలి పారిపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదిలి పారిపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నివాసంలో, నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోతున్నవారి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించే ఆర్డినెన్స్ జారీకి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లును మార్చి 12న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల నిరసనల కారణంగా ఈ బిల్లుకు మోక్షం లభించలేదు. దీంతో పరారైన ఆర్థిక నేరస్థుల ఆర్డినెన్స్ 2018 పేరుతో ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించి, ఆమోదించింది. విచారణ కోసం భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరించే, అరెస్ట్ వారెంట్ జారీ అయిన, రూ.100 కోట్లకు పైగా రుణాలు చెల్లించని ఆర్థిక నేరగాళ్లకు ఈ ఆర్డినెన్స్ నిబంధనలు వర్తిస్తాయి.
కొత్తగా వచ్చిన ఈ ఆర్డినెన్స్ ప్రకారం నిందితుడు దోషి అని తేలక ముందే అతని ఆస్తులు అమ్మి రుణదాతలకు చెల్లించొచ్చు. ఆ నేరగాళ్లను మనీ ల్యాండరింగ్ వ్యతిరేక చట్టం కింద విచారిస్తారు. సదరు నిందితుడిని అప్పు ఎగ్గొట్టి పారిపోయిన నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ విచారణ సంస్థ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాలి. ప్రస్తుతం ఆ ఆర్థిక నేరగాడు ఎక్కడ ఉన్నాడో కూడా అప్లికేషన్‌లో వివరించాలి. అతనికి ఎంత ఆస్తి ఉంది? స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అతని ఆస్తికి ఎవరైనా బినామీలు ఉన్నారా? పారిపోయిన వ్యక్తి ఆస్తిని ఎవరైనా ఇష్టపడు తున్నారా? తదితర విషయాలను అప్లికేషన్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా తమ ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు నిందితుడికి నోటీసులు పంపిస్తుంది.