న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులకు పన్ను, వస్తు సేవల కింద మేలు చేకూర్చేందుకు తగిన అంశాలను కేబినెట్ మంత్రుల బృందం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ మంత్రి పీయుష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన చివరి రెండు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లోనే గృహ కొనుగోలుదారులు, గృహ నిర్మాణ రంగానికి లబ్ధి చేకూర్చేలా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటుందని సంబంధిత రంగాలు ఆశించాయి. కానీ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఎటువంటి స్పష్టత లభించలేదు. 


మధ్య తరగతి వర్గాలకు పన్ను భారాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చెప్పిన పీయూష్ గోయల్.. జీఎస్‌టీ వసూళ్ళు జనవరిలో రూ.1 లక్ష కోట్లు దాటాయని తెలిపారు. జీఎస్‌టీ వల్ల వ్యాపారం మరింత సులభతరమైందన్నారు. చిన్న వ్యాపారులకు ప్రత్యేక లబ్ధి చేకూర్చుతామన్నారు.