శాకాహారం మాత్రమే తినాలని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు శుక్రవారం నాడు పలు ఆసక్తికరమైన విషయాలను భారత ప్రజలతో పంచుకుంది.
సుప్రీంకోర్టు శుక్రవారం నాడు పలు ఆసక్తికరమైన విషయాలను భారత ప్రజలతో పంచుకుంది. కేవలం దేశంలో శాకాహారం మాత్రమే తినాలని ఏ ప్రభుత్వం కూడా ఆర్డర్ ఇచ్చే అవకాశం లేదని.. వారు అలా చేయలేరని తెలిపింది. భారతదేశం నుండి మాంసాహార ఎగుమతులకు స్వస్తి పలకాలని చెబుతూ దాఖలైన ఓ పిల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను న్యాయస్థానం చేసింది. "అందరూ వెజిటేరియన్లుగా మారాలని చెబుతూ న్యాయస్థానం తరఫున మేము ఆర్డర్ ఇవ్వలేము" అని జస్టిస్ మదన్ బి లోకుర్ తెలిపారు. ఈ పిల్ పై విచారణను ఫిబ్రవరి 2019 నాటికి వాయిదా వేస్తున్నామని తెలిపారు. బుధవారం నాడు, రాజధానిలో పలు హిందూ సంఘాలు హల్చల్ చేశాయి.
నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఎలాంటి మాంసాహారం అమ్మకూడదని చెబుతూ స్థానిక హోటల్స్‌కి సూచించాయి. అలా చేస్తే హోటళ్లను తగలబెడతామని కూడా పలు సంఘాలు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. హర్యానాలోని కూడా పలువురు హిందూ సంఘాల కార్యకర్తలు పలు చోట్ల మాంసం దుకాణాలను బంద్ చేయించారు.
సూరత్ నగర్, అశోక్ విహార్, సెక్టర్ 5, సెక్టర్ 9, పటౌడీ చౌక్, జాకబ్ పుర, సాదార్ బజార్, ఖాండ్సా అనాజ్ మండీ, బస్ స్టాండ్, డీఎల్ఎఫ్ ఏరియా, సోనా, సెక్టార్ 14 లాంటి ప్రాంతాల్లో హిందూ సంఘాల కార్యకర్తలు మాంసాహారాన్ని తినకూడదని చెబుతూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. నవరాత్రి సందర్భంగా హిందువుల మనోభావాలను అర్థం చేసుకొని.. హోటళ్లలో మాంసాహారాన్ని సప్లై చేయకూడదని సూచించారు. తమ మాటలను లక్ష్యపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు.